వాహన భీమా ..కొన్ని వాస్తవాలు
రోడ్డు మీద వాహనాన్ని తిప్పాలంటే మాత్రం ఆ వాహనానికి కచ్చితంగా బీమా ఉండాల్సిందే అని మోటార్ వాహనాల చట్టం నిర్దేశిస్తోంది. సంబంధిత వాహనం వల్ల ఇతరులకు గాయాలైనా.. ప్రాణాలు పోయినా లేదా ఆస్తులకు నష్టం వాటిల్లినా బీమా పాలసీ ద్వారా నష్టపరిహారం చెల్లించడమే దీని లక్ష్యం. ప్రమాదం జరిగినప్పుడు ఆ వాహనానికి జరిగిన నష్టానికీ పరిహారం రావాలంటే.. పూర్తి స్థాయి బీమా పాలసీ తీసుకోవాలి. అలాకాకుండా.. కేవలం అవతలి వారికి జరిగే నష్టానికే పరిహారం వచ్చేలా పాలసీ తీసుకుంటే.. దానిని థర్డ్‌పార్టీ బీమా అంటారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఒక వాహనానికి కనీసం థర్డ్ పార్టీ బీమా ఉండాల్సిందే. ప్రమాదానికి వాహనం కారణం అయినప్పుడు బాధిత వ్యక్తికి తగిన పరిహారం అందించడమే దీని ఉద్దేశం. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే.. రూ.5వేల వరకూ, మద్యం సేవించి వాహనం నడిపితే.. రూ.10వేల వరకూ, సీటు బెల్టు పెట్టుకోకపోతే రూ.1,000 వరకూ జరిమానాలుంటాయి. బీమా లేకుండా వాహనాలు నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000వరకూ జరిమానా విధించవచ్చు. కొత్త వెహికల్ కొనగానే..,సాధారంగా అంతా వాహన బీమా పాలసీ తీసుకుంటారు. ఏడాది గడిచాక దాన్ని పాలసీ లాప్స్ అవకుండా, దాన్ని రెన్యువల్ చేయించుకోవటంలో మాత్రం చాలామంది ఆసక్తి చూపించరు.
ప్రస్తుతం దాదాపు అన్ని సాధారణ బీమా సంస్థలు తమ వాహన బీమా పాలసీదారులు సులభంగా పాలసీని రెన్యువల్ చేయించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. తమ వెబ్సైట్లలో అందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ఆన్లైన్ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ల వెబ్సైట్లలో వివిధ బీమా సంస్థలు అందించే పాలసీల ప్రీమియాలను సరిచూసుకోవచ్చు.